ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow

 ఎదురీత | Telugu Stories | Moral Stories @multiplewaystogrow



ఎదురీత

                                    ****

రాజ్యలక్ష్మికి భర్తపోయిన తరువాత అతని ఆఫీస్ లో హెల్పర్ ఉద్యోగం ఇచ్చారు... అది స్టేటు గవర్నమెంట్ ఆఫీస్... 

రాజ్యలక్ష్మి భర్త డ్రైవర్ గా పనిచేసే వాడు... అతను ఆఫీస్ డ్యూటీ లో ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు... వెనుక కూర్చున్న సీనియర్ మానేజర్ ఎలాగో బతికి బయట పడ్డాడు..

ఎంతో షాక్ కి గురి అయినా... 

మనసులో బాధ ఉన్నా, ఏదో ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా పిల్లలను పెంచుకోవచ్చు, సంసారాన్ని ఈదొచ్చు..  అన్న భరోసా కలిగింది...

తను పనిచేసే సెక్షన్ లోపదిమంది ఉంటారు...

వాళ్ళకి ఒక ఆఫీసర్...

ఒక పెద్దాయన యాదగిరి అని, ఇంకో హెల్పర్ ఉన్నాడు అక్కడే....  ఆ సంవత్సరంలోనే రిటైర్ అవుతున్నాడు...

 అందుకని ఈమెని అక్కడ వేశారు...

ఆమె పని, అడిగిన ఫైల్స్ ఇవ్వడం, అవసరమైన పేపర్ల జిరాక్స్ కాపీలు మెషీన్ లో తీసి ఇవ్వడం... యాదగిరి తెచ్చిన టీ ని కప్పుల్లో పోసి, అందరికీ ఇవ్వడం... 

రాజ్యలక్ష్మికు నిండా ముప్పైఏళ్ళు కూడా లేవు... 

ఏమీ అలంకారాలు లేకపోయినా వయసు తెచ్చిన అందంతో, సహజంగా అందంగా ఉండేది..

కానీ ఆమె చేరిన వారానికే ఆ ఆఫీసర్ వక్రబుద్ధి అర్ధమయ్యింది...  

ఏదో పనివంకతో పిలవడం... 

టీఇస్తే కప్ తీసుకుంటూ చెయ్యితాకడం... తాకి అసలు తెలియనట్టు ఉండటం..

ఇలాంటివి అసలు బయటికి ఎలా చెప్పుకోవాలో అర్ధం కాలేదు లక్ష్మికి... 

ఆమెనుండి ఎటువంటి వ్యతిరేకతా లేకపోయేసరికి, అతను మరింత వేధించడం మొదలు పెట్టాడు...

ఫైల్ కోసం స్టోర్ రూమ్ కి వెళ్తే, అతనూ ఏదో పనిఉన్నట్టు రావడం... నువ్వు ఈ చీరలో బావున్నావు అనడం... ఏవో వెకిలి మాటలు మాట్లాడటం...  

రాజ్యలక్ష్మికి ఈ ఉద్యోగం తను చేయగలదా అనిపించేది... దుఃఖం వచ్చేది...

ఎదిరించే ధైర్యం ఉండేది కాదు.

ఉద్యోగం చేయకపోతే, తన పరిస్థితి ఏంటని, చాలా వేదనగా ఉండేది...

ఇలా ఎదురీదడం తనవలన అవుతుందా, అనిపించేది...

ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు... వాళ్ళకి చెప్పుకుని, వాళ్ళని క్షోబపెట్టడం తప్ప.. ఫలితం ఉండదు అని తెలుసు...

ఎప్పుడైనా యాదగిరి, ఆఫీసర్ అడిగిన ఫైల్ తెచ్చిస్తే..నువ్వు తెస్తావేంటి..? ఆమెని చెయ్యనియ్యి. ఆమెకి పని నేర్పు...

నువ్వు రిటైర్ అయ్యాకా,  అన్నీ ఆమెకి తెలియాలి కదా అనేవాడు తెలివిగా...

రాజ్యలక్ష్మి లంచ్ టైమ్  లో తను తెచ్చుకున్న బాక్స్ తినేసి, తన సీట్ లోనే కూర్చునేది..

ఆ ఆఫీసర్ తను తొందరగా తినొచ్చి రాజ్యలక్ష్మిని తన టేబుల్ దగ్గరికి పిలిచి, పెర్సొనల్ విషయాలు అడుగుతూ ఉండేవాడు...

రాజ్యలక్ష్మి కొత్త వలన,  ఇంకా ఎవరితోనూ స్నేహం చేయకపోవడం వలన..బయటికి వెళ్ళేది కాదు...

బెరుకుగా ఉండేది...

ఇలా దినదిన గండంగా గడుస్తుండగా..

రాజ్యలక్ష్మితో ఒకరోజు యాదగిరి అన్నాడు...

అమ్మా..నీ భోజనం అయ్యాకా బయట ఆవరణలోకి వెళ్లమ్మా...అక్కడ వేరేచోట పనిచేసే ఆడవాళ్లు కూడా వస్తారు..వాళ్ళతో స్నేహం చెయ్యి అని...

నీకు ఒంట్లో బాగోలేకపోయినా, రెస్ట్ కావాలన్నా సెలవు పెట్టుకోవచ్చమ్మా....

నువ్వు ముందు చెప్పక్కరలేదు... మానేసి బయటనుండి ఫోన్ చేసి,  సెక్షన్లో ఎవరికన్నా చెప్పొచ్చు.. అనిచెప్పాడు.

సిక్ అయినట్టు చెప్తే, ఎవరూ ఏమీ అనలేరు..

నీకు తెలియదని చెప్తున్నాను...

లీవ్ నుంచి వచ్చాకా, లీవ్ అప్లికేషన్ ఇవ్వొచ్చు కూడా అన్నాడు...

"అలా చేయొచ్చా అంది" లక్ష్మీ ఆశ్చర్యం గా...

"భేషుగ్గా" అన్నాడు యాదగిరి భరోసా ఇస్తూ...

మర్నాటినుండి రాజ్యలక్ష్మి ఒకవారం సెలవు పెట్టింది...

అతని నుండి తాత్కాలికంగా తప్పించుకోవడానికి...

ఒక ఐదురోజులు గడిచాక, ఒక సాయంత్రం యాదగిరి రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చాడు...

చాలా సంతోషంగా తన తల్లిదండ్రులకి పరిచయం చేసింది...

తన పిల్లల్ని చూపించింది ...టీ చేసి తెచ్చి ఇచ్చింది...

కొంచెం సేపయ్యాకా, యాదగిరి అన్నాడు లక్ష్మీతో...  నీకష్టాలు గట్టెక్కాయమ్మా అని...

అర్ధంకానట్టు చూసింది లక్ష్మీ...

యాదగిరి చెప్పడం ప్రారంభించాడు...

"నాకు అంతా తెలుసమ్మా... నేను గమనిస్తూనే ఉన్నాను...

కష్టాలకడలిలో నీలాంటి వాళ్ళు ఎదురీదుతుంటే, మన ఆఫీసర్ లాంటి మొసళ్ళు ఎదురవుతూ ఉంటాయి...

వాటిని తెలివిగా ధైర్యంగా ఎదుర్కోవాలి..

ఆడవాళ్ల సమస్యలు చెప్పుకోడానికి,  ఒక లేడీ లీడర్ కూడా ఉంది యూనియన్ లో...

నువ్వువచ్చాకా నీకు పరిచయం చేస్తాను"...

పోతే, మన ఆఫీసర్ కి కాలువిరిగింది.. మన ఆఫీస్ టాయిలెట్ లోనే జారి పడ్డాడు...

ఒక ఆరువారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలిట...

అయినా పూర్తిగా కోలుకుని నడవడానికి టైం పడుతుంది... అయితే ఆయన ప్లేస్ లో కొత్త ఆఫీసర్ వస్తున్నారు...

అందరూ ఒకేలాఉండరు...

అయితే నీలో ధైర్యం ఉండాలి..... కనీసం ధైర్యంగా ఉన్నట్టు నటించాలి...

చెడ్డపని చేసేవాళ్ళు భయపడతారు...

నువ్వు బయట పెడతావేమో అన్న భయం కలగాలి వాళ్ళకి...

'పాముని కూడా బుస కొట్టకపోతే చంపేస్తారమ్మా"....

కాలము, అనుభవాలు ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నీకు నేర్పిస్తాయి అనుకో..

పోతే, నీకోసలహా...నువ్వు ఆ టెన్త్ మళ్లీ కట్టి, పాస్ అయ్యి, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉంటాయి... అవి పాస్ అయితే,  జీవితంలో ఇంకా పైకి వస్తావు.ఈ స్థాయి నుండి ఎదిగితే,  ఇలాంటి సమస్యలు ఉండవు...

"ఈ విషయం తెలిస్తే, ఆనందపడతావని ఇంటికివచ్చి, మరీచెప్తున్నాను" అన్నాడు .. యాదగిరి...

ఒక్కసారి అతనికి దణ్ణంపెట్టి, బాబాయ్.. అని కళ్లనీళ్లు పెట్టుకుంది లక్ష్మి... 

"అయ్యోవద్దు తల్లీ" ... అని బయలుదేరాడు...

వెళ్తూ మనసులో అనుకున్నాడు... "ఆ ఆఫిసర్ గాడు పడి కాలు విరగడానికి నేనే కారణమన్న రహస్యం.. నాలోనే సమాధి కావాలి"  అని..

'రిటైర్ అయిపోతూ.. ఒక ఆడకూతురికి  

మంచి చేశాననే తృప్తి మిగిలింది యాదగిరికి'..


సమాప్తం


Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now