నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow


 

నమ్మకమే.. స్నేహం! 


బదరిక వనంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దాని నీడలోనే ఓ నీటి కొలను కూడా ఉంది. ఆ చెట్టు మీద బదరీ అనే కొంగ తన బుజ్జి కొంగతో నివసిస్తోంది. అవి కొలనులో దొరికే చేపలు తింటూ హాయిగా జీవిస్తున్నాయి.


బుజ్జి కొంగకు రెక్కలు వచ్చిన తర్వాత కొలను దగ్గరకు వెళ్లి నీటిని, అందులో అటూ ఇటూ గెంతుతున్న చేపను చూస్తూ.. ఎంచక్కా ఆడుకోసాగింది. ఇంతలో అక్కడికి తల్లి కొంగ వచ్చింది. బుజ్జి కొంగ కేరింతలు చూసి.. 'అలా చేప పిల్ల గాలిలోకి ఎగురుతుంటే.. చక్కగా నోటితో పట్టుకుని ఆరగించాలి గాని అలా చూస్తూ కేరింతలు కొడుతున్నావెందుకు?' అని అడిగింది. 'అమ్మా! ఆ చేప పిల్ల నీటిలో నుంచి గాలిలోకి ఎంత ఆనందంగా గంతులు వేస్తుందో.. ఆ చేపపిల్లతో నాకు స్నేహం చేయాలని అనిపిస్తోంది. కానీ.. దాన్ని తినాలనిపించడంలేదు' అంది. 'చేపలు మన ఆహారం. వాటితో నీకు స్నేహం ఏంటి?' అంటూ అక్కడి నుంచి చెట్టు మీదకు ఎగిరిపోయింది తల్లి కొంగ.


ఈ మాటలన్నీ.. కొలనులో ఉన్న చేపపిల్ల విన్నది. దాంతో అది భయపడి ఇక గాల్లోకి గెంతడం ఆపేసింది. బుజ్జి కొంగ ఏమో.. ఒడ్డున నిలబడి ఆ చేపపిల్ల ఎప్పుడు ఎగురుతుందా అని ఎదురు చూస్తోంది. ఎంతసేపైనా అది పైకి రాకపోవడంతో.. ‘చేప మిత్రమా! నా వల్ల నీకు ఎలాంటి హానీ జరగదు. నీకేం భయం లేదు. నేను నీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు నుంచి నువ్వూ నేనూ స్నేహితులం. ఇక భయం విడిచి, ఒకసారి పైకి రా' అంది పిల్ల కొంగ. దాంతో ఆ చేపపిల్ల మెల్లగా కొంగ దగ్గరకు గెంతింది. రెండూ చక్కగా మాట్లాడుకున్నాయి. మంచి స్నేహితులు కూడా అయ్యాయి. ఆ రోజు నుంచి బుజ్జి కొంగ కొలను దగ్గరికి రావడం, అక్కడే కలిసి ఆడుకోవడం వాటికి దినచర్యగా మారింది. బుజ్జి కొంగతో చేపపిల్ల ఆడుకోవడం చూసిన కొలనులోని మిగతా చేపలు.. 'నీకేమైనా మతి పోయిందా! మనల్ని ఆహారంగా తినే కొంగతో స్నేహం చేస్తున్నావు. ఏదో ఒకరోజు అది నిన్ను తినేస్తుంది. నీ మంచి కోసమే చెబుతున్నాం. కోరి కోరి ప్రమాదం తెచ్చుకోకు' అని దాన్ని హెచ్చరించాయి. అప్పుడది.. 'బుజ్జి కొంగ నా నేస్తం. దాని గురించి నాకు బాగా తెలుసు. మీరు అటువంటి అపోహలేం పెట్టుకోవద్దు' అని బదులిచ్చింది. బుజ్జి కొంగతో కూడా మిగతా కొంగలు ఆ చేపను ఎంచక్కా తినేయొచ్చు కదా! అనేవి కానీ అది మాత్రం.. 'నాకు చేప నేస్తం అంటే చాలా ఇష్టం. మనల్ని నమ్మిన స్నేహితులకు ఎప్పుడూ అపకారం చేయకూడదు. మీరు కూడా నా నేస్తానికి ఎలాంటి హాని తలపెట్టకండి' అని చెప్పేది.


ఇంతలోనే వేసవికాలం వచ్చింది. కొలనులో నీరంతా అడుగంటిపోసాగింది. అది గమనించిన బుజ్జి కొంగ.. 'మిత్రమా! కొలనులో నీరు తగ్గిపోతుంది. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇక్కడికి దగ్గర్లోనే ఒక పెద్ద కొలను ఉంది. రేపు నిన్ను అక్కడికి చేరుస్తాను.. సరేనా!' అంది. దానికి.. 'అలాగే మిత్రమా! నువ్వు ఎలా అంటే అలా' అని ఆనందంగా జవాబిచ్చింది చేపపిల్ల. ఇదే విషయాన్ని కొలనులోని మిగతా చేపలకు చెప్పి.. 'మీరు కూడా నాతో పాటు వస్తామంటే.. నా నేస్తానికి మిమ్మల్ని అక్కడికి చేర్చమని చెబుతాను.. వస్తారా?' అని అడిగిందది. 'మాకేమీ కొంగ సహాయం అక్కర్లేదు. మేము ఇక్కడే ఉంటాం. మా మాట విని నువ్వు కూడా ఇక్కడే ఉండిపో. మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది' అని సమాధానమిచ్చాయా చేపలు. 'నా నేస్తాన్ని నమ్ముతాను. అది నాకు ఎప్పుడూ.. మంచే చేస్తుంది' అని చెప్పింది చేపపిల్ల.


ఇక మరుసటి రోజు ఉదయమే బుజ్జి కొంగ రాక కోసం ఎదురు చూడసాగిందది. అంతలోనే అది రానే వచ్చేసింది. చేపపిల్లను నోట కరుచుకుని జాగ్రత్తగా దగ్గరలో ఉన్న మరో కొలనుకు చేర్చింది. అక్కడ నీరు సమృద్ధిగా ఉండడంతో చేప పిల్ల ఆనందంగా జీవించసాగింది. గాలిలోకి ఎగురుతూ తన నేస్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంది. బుజ్జి కొంగ కూడా తన తల్లి బదరీతో చెప్పి ఆ కొలనుకు సమీపంలో ఉన్న చెట్టు మీద వాటి నివాసం ఏర్పాటు చేయించింది. నమ్మకమే స్నేహమని నిరూపించిన బుజ్జి కొంగ, చేపపిల్లను చూసి బదరీ ఎంతో మురిసిపోయింది.


సమాప్తం


Comments

Popular posts from this blog

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now