గుణమే ప్రధానం! (కథ) | Telugu Kadhalu | Moral Stories @multiplewaystogrow

 


*గుణమే ప్రధానం!* (కథ)


 *అదొక* అందమైన పూల తోట ఆ తోటలో గులాబీ, మల్లె, సంపెంగ, విరజాజి, మందారం వంటి రకరకాల పూల మొక్కలు చాలా ఉన్నాయి. వాటికి విరబూసిన పువ్వులతో ప్రకృతిని ఆహ్లాదపరుస్తున్నాయి.

 అప్పుడే ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి గులాబీ మొక్క మీద వాలబోతూ ఆగింది.

'ఆగావేంటి?' అని ప్రశ్నించింది గులాబీ మొక్క.

 "నేను అందంగా ఉన్నానా?" అడిగింది సీతాకోకచిలుక.

 అందుకు గులాబీ మొక్క నవ్వుతూ... 'నీకేం తక్కువ? నారింజ రంగు  రెక్కలతో, మధ్యలో నల్లని చిన్ని చిన్ని చుక్కలతో చక్కగా ఉన్నావనుకో!' అని జవాబిచ్చింది. 

గులాబీ మొక్క మాటలు సీతాకోకచిలుకలో ఆనందాన్ని కలిగించాయి..

'నా గురించి మల్లె ఏమంటుందో?' అంటూ మల్లె మొక్క దగ్గరకు వెళ్లి అడిగింది.

అప్పుడు మల్లె 

 సీతాకోకచిలుకతో  'నువ్వు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తోటలో రాణిలా ఉన్నావనుకో!' అంది. మల్లె మొక్క మాటలకు సీతాకోకచిలుక మరింత ఆనందించింది.

పక్కనే ఉన్న ముద్దబంతి మొక్కను కూడా తన అందం గురించి అడిగింది. 

"గులాబీ, మల్లె చెప్పిన మాటలే నావి కూడా.. నిజంగా చాలా బాగున్నావు నువ్వు!" అంది బంతి మొక్క.

'మీ మాటలు నాకు చాలా సంతోషాన్నిస్తున్నాయి!' అంటూ మందారం మొక్క వైపు వెళ్లింది. దాని వద్దకు వెళ్లి.. మళ్లీ అదే ప్రశ్న అడిగింది.

 "నీకు నా దిష్టే తగిలేటట్టుంది. అంత బావున్నావు నువ్వు" అంటూ మందారం కూడా సీతాకోకచిలుకను పొగిడింది.

"నా అందాన్ని మీరందరూ పొగిడినందుకు ధన్యవాదాలు!" అంటూ ఎగిరి వెళ్లిపోతున్న సీతాకోకచిలుకను మందారం ఆపింది. 

"ఇంతకూ

మా అందరినీ నీ అందం గురించి అడిగావు సరే! నీకు మేమెవ్వరమూ నచ్చలేదా? మాలో ఏ ఒక్కరి పైనా వాలకుండానే వెళ్లిపోతున్నావు?'' అని ప్రశ్నించింది.

మందారం మాటలకు సీతాకోకచిలుక సమాదానం చెప్పకుండా గట్టిగా నవ్వింది.

 "సమాధానం చెప్పకుండా, వెక్కిరింతగా నవ్వుతావే?" అని మందారం కొంచెం కోప్పడుతూ అడిగింది. 

'కోపం వద్దు. నాకు మీరెవ్వరూ ఇష్టం లేదు. మీ అందరికీ దూరంగా ఉన్న ఆ జామ మొక్క అంటేనే నాకు ఇష్టం!" బదులిచ్చింది సీతాకోకచిలుక.

ఆ మాటలకు పూల మొక్కలన్నీ ఆశ్చర్యపోతూ.. "కాయలే కానీ పువ్వులు పూయని, సువాసనలు వెదజల్లలేని ఆ జామ మొక్కంటే నీకు ఇష్టమా? నీ అమాయకత్వానికి మాకు జాలేస్తోంది. జామ మొక్కలో ఏ గుణం చూసి నువ్వు ఇష్టం అంటున్నావో ?మాకైతే అర్ధం కావడం లేదు!" సీతాకోకచిలుక వైపు విచిత్రంగా చూస్తూ అడిగాయి.

"ఆశ్చర్య పడకండి! నే చెప్పేది వింటే మీకే తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఒక గొంగళి పురుగు విశ్రాంతి కోసం మీ మొక్కలను ఆశ్రయించింది. అయితే నల్లగా ఉందని, ఆకారం చూస్తే వికారం కలుగుతోందని,  ఆ గొంగళి పురుగును మీరంతా కలిసి హీనంగా చూస్తూ, దారుణంగా తరిమి కొట్టారు. ఒంటరిగా, దిగాలుగా ఉన్న ఆ గొంగళి పురుగును మీకు దూరంగా ఉన్న జామ మొక్క ఆదరించింది. తన కాండంపై ఆశ్రయం ఇచ్చి విశ్రాంతి తీసుకోమంది" అని చెప్పింది. సీతాకోకచిలుక

"మరి ఇప్పుడు ఆ గొంగళి పురుగు అక్కడ లేదుగా? జామ మొక్క కూడా తరిమేసిందా?" మందారం మొక్క వెక్కిరిస్తూ అడిగింది.

 అప్పుడు సీతాకోకచిలుక నవ్వుతూ, "ఆ పురుగు రూపాంతరం చెందింది. సీతాకోకచిలుకలా , అందంగా మారి మీ ముందుకొచ్చింది!' అని చెప్పింది.

"ఆఁ! అవునా?" అంటూ సీతాకోకచిలుక కేసి మొక్కలన్నీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాయి.

"ఆశ్చర్యం వద్దు. అప్పుడు ఆకారం చూసి నన్ను అసహ్యించుకున్నారు. ఇప్పుడు నా రూపం చూసి ఆదరిస్తున్నారు. కానీ అందం కన్నా గుణం ప్రధానం అనుకుంది ఆ జామ మొక్క. ఆదుకున్న వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని మరువరాదు. ఇప్పటికైనా' అందం కన్నా గుణం ప్రధానం'  అని గమనించండి. ఇది చెప్పాలనే మీ ముందుకొచ్చాను. ఇంతసేపూ మాట్లాడాను. నా నేస్తం పిలుస్తోంది. నేను వస్తాను!" అంటూ.... సీతాకోకచిలుక తన చిట్టి, చిట్టి రెక్కలతో ఎగురుకుంటూ వెళ్లి జామ మొక్క మీద వాలింది.

 తమ తప్పు తెలుసుకున్న ఆ పూల మొక్కలన్నీ సిగ్గుతో తల దించుకున్నాయి.


 ** సమాప్తం **


Comments

Popular posts from this blog

Amazon is hiring for Associate – Retail Process | Apply Now

విజయ భాస్కరుని కథ,-మరణం అకాలమ్మున రాదు మహి నెవ్వా రికిని

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow