తాతయ్య మెచ్చిన పాటలు (కథ) | Moral Stories In Telugu | Story Telling Telugu @multiplewaystogrow


 

తాతయ్య మెచ్చిన పాటలు (కథ): 

      "హరిణీ! ఆ గోల ఏంటి? చిరాకు వస్తుంది. కొంచెం ఆపుతావా?" కోపంగా అన్నాడు తాతయ్య రామయ్య.. "నా పాట గోలగా ఉందా? మా పాఠశాలలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అందరికీ నా పాటలే ఇష్టం. నేను మా పాఠశాలలో నంబర్ వన్ గాయకురాలిని. నన్ను ఇంత అవమానిస్తావా?" అంటూ కోపంగా వెళ్ళిపోయింది హరిణి. 

       వాళ్ళ ఇంటికి హరిణి వాళ్ళ అమ్మ మాలిని. వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు కమల వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చింది. అతిథి మర్యాదల తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో వాళ్ళ పిల్లల గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. మాలిని తన కూతురు చాలా బాగా పాడుతుందని, తన కూతురి పాటలను అభిమానించేవారు చాలా మంది ఉన్నారని గొప్పలు చెబుతుంది. "మాకూ ఆ పాటలు వినాలని ఉంది." అన్నది కమల. అమ్మ పిలవగానే వచ్చి హరిణి పాటలు పాడడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక తాతయ్య "అమ్మా శివానీ జండూ బాం తీసుకుని రామ్మా! నాకు తలనొప్పిగా ఉంది." అని పక్క గదిలోంచి రామయ్య పిలిచాడు. హరిణి చిన్నబుచ్చుకుంది.

       అతిథులు వెళ్ళిపోయాక "ఏంటమ్మా! తాతయ్య పద్ధతి నాకు నచ్చలేదు. రాక రాక మన ఇంటికి వచ్చాడన్న ఆనందం లేకుండా చేస్తున్నాడు. నేను పాడిన ప్రతీసారీ తనకు తలనొప్పి వస్తుందట. ఈ తాతయ్య ఎంత తొందరగా తన ఇంటికి వెళ్ళిపోతాడో!" అన్నది హరిణి. "తప్పు అలా అనవచ్చా? తాతయ్య చాలా క్రమశిక్షణ గల మనిషి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణతో పెంచబట్టే మేము బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సాధించి, మిమ్మల్ని మరింత బాగా చదివిస్తున్నాము. మా చదువు పట్ల శ్రద్ధ చూపడమే గాక రకరకాల కథల పుస్తకాలను తెచ్చి చదివించేవాడు. క్రమశిక్షణ తప్పామా? బాబోయ్! ఆ తిట్లు భరించలేము. అందుకే మా నాన్న అంటే ఇప్పటికీ మాకు భయమే! మీరూ ఉన్నారు. మేము కాస్త స్వేచ్ఛ ఇచ్చేసరికి చాలా విషయాల్లో చెప్పిన మాట వినడం లేదు. తాతయ్యను అలా అనవద్దు. తాతయ్య వాకింగ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు పాడుకో." అంది మాలిని. హరిణికి ఈ మాటలు రుచించలేదు. అసహనంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

       ఒకరోజు మాలినీ వాళ్ళ వీథిలో ఉన్న పిల్లలూ వాళ్ళ తల్లిదండ్రులూ వన భోజనాలకు వెళ్ళారు. ఇంట్లో ఏమీ తోచక హరిణీ వాళ్ళ తాతయ్య రామయ్య కూడా వచ్చాడు. పిల్లలు రకరకాల ఆటలు ఆడుతూ, కళలను ప్రదర్శిస్తున్నారు. శ్రావణి అనే అమ్మాయి "తియ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు" అనే పాటను శ్రావ్యంగా పాడుతుంది. రామయ్య చాలా మంత్ర ముగ్దంగా పాటను విన్నాడు. శ్రావణిని ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు. "చాలా బాగా పాడావమ్మా. ఏదైనా భక్తి పాటను పాడారు." అన్నాడు. "నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం" అనే పాటను పాడింది శ్రావణి. మరింత ప్రవేశించాడు రామయ్య. "ఏదైనా దేశభక్తి గీతం పాడమ్మా" అన్నాడు. "నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు" అనే పాటను పాడింది. "ఇలాంటి పాటలు విని చాలా కాలం అయింది. మళ్ళీ నన్ను ఆ కాలంలోకి తీసుకెళ్ళావమ్మా." అన్నాడు రామయ్య. 500 రూపాయలు బహుమతిగా ఇవ్వబోయాడు. వద్దన్నది శ్రావణి. "నేను నీ తాతయ్యను అనుకో. నీ తాతయ్య ఇస్తున్నా తీసుకోవా." అన్నాడు రామయ్య. తీసుకుంది శ్రావణి. శ్రావణిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నుదుట ముద్దు పెట్టాడు రామయ్య.

        ఇంటికి వచ్చిన తాతయ్యతో "నా పాటలు అంటే చిరాకు నీకు. బయటి వాళ్ళ పాత చింతకాయ పచ్చడి పాటలు నీకు బాగా నచ్చాయా?" అన్నది హరిణి. "సరే ఇప్పుడు వింటా. మంచి పాటకు వెయ్యి రూపాయల బహుమతి." అన్నాడు తాతయ్య. ఒక పాట పాడింది హరిణి. "ఏదీ ఆ పాటకు అర్థం చెప్పు." అన్నాడు తాతయ్య. మౌనంగా ఉంది హరిణి. పోనీ మరొక పాట పాడు మంచి భావం ఉన్నది." అన్నాడు తాతయ్య. పాడింది హరిణి. "ఈ పాట వల్ల నువ్వు నేర్చుకుంది ఏమిటి?" అడిగాడు తాతయ్య. సిగ్గుతో తల వంచుకుంది మాలిని. మాలినికి తన తప్పు తెలిసి వచ్చింది. "చూడమ్మా హరిణీ! ఇప్పుడు వచ్చే పాటల అర్థం తెలిస్తే అస్సలు పాడలేవు. అలాంటి అర్థం పర్థం లేని పాటలు కొన్ని వేలు నేర్చుకున్నా వ్యర్థమే. పాత ఒక రోత అనుకోవడం మూర్ఖత్వం. శ్రావణి పాటలకు ఎంతమంది చప్పట్లు కొట్టారో గమనించారా? మరి నీ పాటలకు వచ్చిన స్పందన ఎంత? మంచి భావం ఉన్నవి, సందేశాన్ని ఇచ్చేవి, భక్తి, దేశభక్తి గీతాలు నేర్చుకో. నీకు కావాలంటే దగ్గర ఉండి నేను నేర్పిస్తాను. ఇప్పటి తరం వారికి ఇలా చెబితే నచ్చదు. నాకు అనుభవం అయింది కాబట్టి చెప్పడం మానేశాను." అన్నాడు తాతయ్య. హరిణి తాతయ్య దగ్గర చాలా మంచి పాటలను నేర్చుకుంది. వాటిని పాడి అంతటా మంచి పేరు తెచ్చుకుంది.

Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now