తోడు | ప్రేమ | Love Stories In Telugu | Moral Stories In Telugu | Telugu Kadalu @multiplewaystogrow

తోడు | ప్రేమ | Love Stories In Telugu | Moral Stories In Telugu | Telugu Kadalu @multiplewaystogrow  



మన బ్లాగు కి స్వాగతం 

ఈరోజు కధ పేరు

తోడు

ఉదయం ఏడుగంటలకే స్నానం చేసి దేవుని గదిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని లేచి హాల్ లోకి వచ్చి తన కూతురితో "అమ్మా సుధేష్ణ .  నేను వెళ్ళి రానా" అన్నాడు చిరునవ్వుతో సంగ్రామ్.

 "యువార్ లుకింగ్ గుడ్ నాన్నా. ఆల్ ది బెస్ట్. నిన్ననే వెనుక వీధిలో ఉన్న మన ఇంటిని క్లీన్ చేయించి మొత్తం సర్ది పెట్టాను. మీరు పనయ్యాక ఆ ఇంటికే వెళ్ళండి. పనిమనిషి మధ్యాహ్నానికి భోజనం వండి పెడుతుంది." అంది చిరునవ్వుతో.

సంగ్రామ్ ఇంటి నుండి బయలుదేరి వీధి మలుపులో ఉన్న మున్సిపల్ పార్క్ లోకి ఎంటర్ అయ్యాడు.  అక్కడ  గ్రీన్ కలర్ సిట్టింగ్ బెంచి పై కూర్చున్న  వర్ధనిని  చూడగానే కళ్ళు ఆనందంతో  అడుగులు పెద్దవయ్యాయి.

ఆమెకు దగ్గరగా వెళ్ళే కొద్దీ సంగ్రామ్ గుండె  సడి సంతోషంతో మరింత వేగం పుంజుకున్నట్టు అనిపించింది.

వర్ధని పక్కనే కూర్చున్న  సంగ్రామ్ కొడుకు కిషోర్ "సారీ నాన్నా"అన్నాడు తలవంచుకుని.

సంగ్రామ్ కిషోర్ భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు "థ్యాంక్స్ రా కన్నా "అంటూ

కిషోర్ నవ్వుతూ ఇంటిదారి పట్టాడు.

దగ్గరగా వచ్చి నించున్న సంగ్రామ్ ను చూడగానే  వర్ధని ఓ వైపు సంతోషం మరో వైపు బాధతో లేచి నుంచుంది.

మాటలు గొంతు దాటి రాలేని స్థితి ఇద్దరిదీ.

"ఎలా ఉన్నావు వర్ధినీ" అడిగాడు సంగ్రామ్.

మిమ్మల్ని వదిలి ఉన్న ఈ కొద్ది రోజులు నరకంలా గడిచాయి"అంది ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ.

ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర .

అప్పటికే మసకగా మారిన అతని కంటికి  మనసుకి ఆమె ప్రేమ తెలుస్తోంది.

ఇన్నేళ్ళయినా ఆమె చూసే చూపులకు అతని మనసున ఓ అవ్యక్త మధురానుభూతి.

నిజమే వర్ధని తనను ఎంతో మిస్ అయి ఉంటుంది. తను కూడా అంతేగా. వర్ధని కోసం ఎంతగా వేదన చెందాడు.

వర్ధని చేతిని తన చేతిలోకి తీసుకుని అలా నడుచుకుంటూ అక్కడికి  దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ ఆర్డర్ చేశారు

@@@@@@@

"చూసుకుని తిను వరూ . మీద ఒలుకుతుంది" అంటూ ఆవిడ మొహాన్ని కర్చీఫ్ తో తుడిచి ఆవిడ తింటుంటే అపురూపంగా చూస్తున్నాడు  సంగ్రామ్

"నీకు ఇష్టమైన పొంగలి తెప్పించుకుని తినచ్చుగా. ఈ హోటల్ లో జీడిపప్పు పొంగలి బాగుంటుందని మన సుధేష్ణ చెప్పింది"అంది వర్ధని

" నిజమే . కిషోర్ ఆస్ట్రేలియా వెళ్ళాక అక్కడ వాడికి జాండీస్ అటాక్ అయ్యాయని తెలిసి చాలా బాధపడ్డానని తెలుసుగా. మనకు ఇష్టమైనది ఒక సంవత్సరం పాటు ఆ దేవుడికి వదిలేస్తే మనం కోరిన కోరికలు తీరుతాయని ఎవరో చెప్తే నాకిష్టమైన పొంగలి తినకుండా వదిలేసాను.అప్పుడే దేవుడికి "చెప్తున్నాడు సంగ్రామ్

అప్పటికే వాళ్ళిద్దరినీ గమనిస్తున్న  పక్క టేబుల్ దగ్గర కూర్చున్న విశాల్ వారి దగ్గరకెళ్ళి " వావ్ సూపర్ తాతయ్య గారూ.ఈ వయసులో కూడా ఇంత అన్యోన్యంగా ఉన్నారు మీరిద్దరూ" అన్నాడు సంగ్రామ్ తో చేతులు కలుపుతూ.

సంగ్రామ్ కిషోర్ ను ఆశ్చర్యంగా చూస్తూ "అంటే మీ ఉద్దేశం అర్థం కాలేదు బాబూ అన్నాడు

"అయ్యో తాతగారూ ఈ వయసులో కూడా మీరు మీ ఆవిడను ఇంత అన్యోన్యంగా చూసుకుంటున్నారంటే మీరిద్దరూ వయసులో ఉన్నప్పుడు ఇంకెంత సంతోషంగా ఉంటారో కదా అని నా ఆలోచన . మీ గురించి తెలుసుకోవచ్చా అన్నాడు

"ఓహ్ అదా. "అంటూ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

కూర్చో బాబు. మీకు వినే సమయం ఉండాలే కానీ  మా గురించి  సంతోషంగా చెప్తాను అంటూ కుర్చీ చూపించాడు.

"నా పేరు సంగ్రామ్. ఈవిడ వర్ధని.

నిజానికి మీరనుకున్నట్టు మేమిద్దరం మొదటినుండి భార్యాభర్తలు కాదు.  ఈ మధ్యనే భార్యా భర్తలం అయ్యాం.

మాది తూర్పుగోదావరి జిల్లా. మా నాన్నగారు మిలట్రీ లో పనిచేసేవారు.  అందుకే నా పేరును అప్పట్లోనే సంగ్రామ్ అని పెట్టారు.అమ్మా నేను అమ్మమ్మా తాతయ్యలతో కలిసి ఉండేవాళ్ళం. 

నా పదేళ్ళపుడు వర్ధని కుటుంబం వర్ధని తండ్రి ఉద్యోగ బదిలీ పై మా ఊరొచ్చారు. మా పొరుగింట్లో ఉండేవాళ్ళు.

చాలా కొద్దికాలంలోనే  ఇరు కుటుంబాలు ఆత్మీయులు గా మారిపోయాం. వర్ధని తో నాకు మంచి స్నేహం కుదిరింది.మా అమ్మకు  ఆడపిల్లలు  అంటే ఎంతో ఇష్టం.అలా వర్ధనికి జడలు వేయడం.  మల్లెపూల ను మాలగా కట్టి ఇవ్వడం. ఇంట్లో ఉన్న గోరింటాకు రుబ్బి వర్ధని రెండు అరచేతులకు పెట్టేది. వర్ధని తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు.

వర్ధని ఎక్కడికి వెళ్ళినా నన్ను తోడుగా పంపేవారు. వర్ధని తల్లి ఏం వండినా నాకు ప్రేమగా పంపేవారు.

కాలం గడిచింది.

వర్ధని నేను మాకు తెలియకుండానే ఒకరినొకరం ఇష్టపడ్డాం. 

చూడచక్కని రూపంతో అమాయక ముగ్ధలా ఉండే వర్ధని అంటే అపురూపం నాకు.అది ప్రేమ అని తెలుసుకునే లోపే వర్ధని కి పెళ్ళి కుదిరింది. పెద్దలకు చెప్పే ధైర్యం కానీ వారు ఒప్పుకోకపోతే ఎదిరించే ధైర్యం కానీ మా ఇద్దరికీ లేవు. 

దానితో చూస్తుండగానే వర్ధని పెళ్ళి జరిగి వెళ్ళిపోయింది.

నేను నా పిరికితనంతో వర్ధనిని కోల్పోయినందుకు ఎంతో వేదనకు లోనయ్యాను. ఏదో కోల్పోయిన వాడిలా తయారయ్యా. ఈలోపు వర్ధని తల్లిదండ్రులు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. ఈ లోపు అమ్మ నాన్నలు నాకు పెళ్ళి చేశారు. అలా నా భార్య శుభ నా జీవితంలో కి అడుగు పెట్టింది. మాకు ఒక బాబు ఒక పాప. ఇప్పుడు బాబు ఆస్ట్రేలియా లో ఉద్యోగం. కూతురు అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ప్రస్తుతం కూతురి దగ్గరే ఉంటున్నాను.

వర్ధని భర్త కాంట్రాక్టర్.బాగా డబ్బు సంపాదించాడు . ఇద్దరు ఆడపిల్లలు.పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు.  వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళయిపోయాయి.ఆరు సంవత్సరాల క్రితం భర్త చనిపోవడం పిల్లలు దూరంగా సెటిలైపోవడంతో విజయవాడ లోని వృద్ధాశ్రమం లో ఉంటుందని తెలుసుకున్నాను.

మూడు సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది.

ఒంటరితనం ఎక్కువైపోయింది.విపరీతంగా సిగరెట్ లు కాల్చే వాణ్ణి. షుగర్ బీపీ ఎక్కువయ్యాయి. ఈ సమయంలో వర్ధని తో నా జీవితం తీరని కలగా  ఒక లోటుగా మిగిలిపోయిందని తెలుసుకున్నా. పెరిగిన టెక్నాలజీ తో వర్ధని ఆచూకీ తెలుసుకున్నా. వృద్ధాశ్రమంలో తనని కలిసా.

నిజంగా ఆ క్షణం ఓ అద్భుతం. మనసులో వేయి వీణలు శృతి చేసిన భావన. ఒకరిపట్ల ఒకరికున్న ఆరాధనతో కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. అంతులేని కబుర్లు పంచుకున్నాం. నాలో ఉత్సాహం పెరిగింది. చీకటి పడే వేళకు తనని వదలలేక వదిలి ఇంటికి వచ్చేశా.

తనని వదిలి వెళ్తుంటే తను చూసిన చూపు తను భరిస్తున్న ఒంటరితనం ఎంత భయానకంగా ఉందో అర్థమై కంపించిపోయాను. 

ఆ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నా. 

కళ్ళ ముందు ఎంతో గారాబంగా పెరిగిన వర్ధని అలా ఒంటరిగా ఎవరికీ పనికిరాని మనిషిగా వదలివేయబడడం నా మనసుకు ఎంతో వేదన కలిగించింది.

మరుసటి రోజు ఉదయం ఆశ్రమానికి వెళ్ళి తనని తీసుకుని నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళి తనని పెళ్ళి చేసుకున్నా.వృద్దాప్యంలో నా శరీరం వడలిపోయి ఏ కోరికా లేదు.కానీ మనసు మాత్రం ఎంతగా  వర్ధని తోడుని కోరుకుంటోందో అర్థమైంది.

విషయం తెలిసిన పిల్లలు నానా రాద్దాంతం చేశారు. వర్ధని భయపడిపోయింది. నేనే వర్ధని కి ధైర్యం చెప్పి పిల్లలెవరినీ కలవవద్దని వార్నింగ్ ఇచ్చాను. 

వర్ధని తో నే కోరుకున్న జీవితం మొదలైంది.  సిగరెట్ కాల్చడం మానేశాను. ఉదయం సాయంత్రం ఇద్దరం వాక్ కు వెళ్ళేవాళ్ళం. పనిమనిషి  వచ్చి వండి పెట్టేది .ఇంటి పనులన్నీ పనిమనిషే చేసేది. ఆశ్చర్యంగా రోజులు గడిచే కొద్దీ నాకు షుగర్ బీపీ కంట్రోల్ అయ్యాయి. వర్ధని తోడుగా నా జీవితం సంతోషంగా సాగిపోయింది. 

అకస్మాత్తుగా ఓ రోజు నా కొడుకు వచ్చి వర్ధని ని నానా మాటలన్నాడు. వేదనతో వర్ధని తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. 

ఆ రోజు నా బాధ వర్ణనాతీతం.గుండెల్లో నొప్పితో కూలబడిపోయా. ఆసుపత్రికి తరలించారు.  మైల్డ్ హార్ట్ ఎటాక్ అని చెప్పారు. ఇక పిల్లల మనసు కరిగింది. మూడు రోజుల క్రితం నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు.

ఆస్ట్రేలియా నుండి సెలవు పై వచ్చిన  నా కొడుకు వెళ్ళి వర్ధని ని బతిమాలి తీసుకొచ్చి నాకు సంతోషాన్ని కానుకగా ఇచ్చాడు.  నా కూతురు అల్లుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.

వర్ధని వైపు అయితే ఆమె పిల్లలు ఆమె ఊసే వద్దనుకున్నారు . ఆస్తులు పంచుకున్నారు. ఆమె బాధ్యత వద్దనుకునే ఆశ్రమంలో చేర్చారు. వర్ధని మంచితనమే ఆమె పాలిట శాపం.వర్ధని మంచితనం చేతగానితనం అయింది.

ఈ దేవత అవసరం ఆమె పిల్లలకు లేదు.

కానీ ఈ భక్తుడికి ఆమె తోడిదే లోకం

ఇక నుండి మమ్మల్ని ఆ చావు తప్ప ఎవరూ  వేరుచేయలేరు. ఇదీ మా కథ.  ఇక వెళ్ళొస్తాం బాబూ.అంటుంటే అక్కడున్న ముగ్గురి హృదయాలు బరువెక్కాయి.

సంగ్రామ్ టిఫిన్ బిల్లు చెల్లించి  వర్ధని చేయి  పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ బయలుదేరాడు.  జీవన అస్తమయ సమయంలో తోడునీడగా ఉండాలనుకుంటూ సంతొషంగా నడుస్తూ ఆశావహ దృక్పథంతో అడుగేస్తున్న వృద్ధులు సంగ్రామ్ వర్ధినిని హృదయపూర్వకంగా అభిమానంగా చూస్తూ ఉండిపోయాడు విశాల్.

జీవన దశల్లో వృద్ధాప్యం చివరిదశ. అంతవరకూ కుటుంబ అభివృద్ధి కోసం భరించిన కష్టాలు ఒక ఎత్తు. జీవిత చరమాంకం లోకి వస్తే  వృద్ధాప్యం లో ఒంటరితనం భరించలేనిది. ఒంటరి ప్రాణం తోడు కోసం అలమటిస్తుంది. కష్టం సుఖం పంచుకునే తోడు ఉండడం ఒక వరం.

సమాప్తం

ధన్యవాదాలు,

మరి కొన్ని కధలు కోసం మన ఛానల్ ని Like చేసి Subscribe చేసుకోండి.

మీ శ్రేయాభిలాషి,

Multiplewaystogrow

Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now