ఊరు - అడవి ( విక్రమార్కుడు - బేతాళుడు - 1) | Moral Stories | Telugu Kathalu @multiplewaystogrow


 ఊరు - అడవి ( విక్రమార్కుడు - బేతాళుడు - 1) | Moral Stories | Telugu Kathalu @multiplewaystogrow

ఊరు -అడవి


గోదావరీ తీరాన ప్రతిష్ఠాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు. కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది. రాజు ఆశ్చర్యపడి, ‘‘నానుండి నీకేం సాయం కావాలి?’’ అని భిక్షువునడిగాడు.


‘‘రాజా! నేను మంత్రసాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావడానికి నీఅంత మహావీరుడి సాయం కావాలి. వచ్చే కృష్ణచతుర్దశినాటిరాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రిచెట్టు వద్దకు వస్తే ఆ సాయమేమిటో చెబుతాను’’ అన్నాడు భిక్షువు.రాజు సరేనని భిక్షువుని పంపేశాడు. తర్వాత అతడు కోరినట్లే కృష్ణచతుర్దశినాటిరాత్రి విక్రమార్కుడు నల్లటి బట్టలు ధరించి, కత్తి చేత ధరించి, శ్మశానానికి వెళ్లి అక్కడ మర్రిచెట్టుకింద ఉన్న భిక్షువు దగ్గరకు చేరుకున్నాడు. భిక్షువు అతడితో, ‘‘రాజా! దక్షిణంగా వెడితే అక్కడ ఒకే ఒక ఇరుగుడుచెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవా శవాన్ని చెట్టునుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి. పొరపాటున కూడా నోరు విప్పకూడదు సుమా’’ అన్నాడు.


రాజు సరేనని దక్షిణాభిముఖుడై వెళ్లి ఇరుగుడుచెట్టు వద్దకు చేరుకుని, చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూశాడు. చెట్టెక్కి, శవం మెడకున్న తాడును కత్తితో కోసేసరికి శవం కిందపడి, దెబ్బ తగిలినట్లుగా ఏడవసాగింది. తెల్లబోయిన రాజు చెట్టు దిగి వచ్చి, శవాన్ని తడిమి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. దాంతో ఆ శవంలో బేతాళుడున్నట్లు అర్థమై, ‘‘ఎందుకు నవ్వుతావు?’’ అన్నాడు రాజు. అతడిలా నోరు విప్పి మాట్లాడగానే, అలా శవం చివాలున వెళ్లి మళ్లీ చెట్టున వేలాడసాగింది. మాట్లాడి తప్పు చేశానని గ్రహించిన రాజు, మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంవైపు నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు ‘‘రాజా! పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకు ఆ శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక చిన్నకథ చెబుతాను, విను’’ అంటూ విక్రమార్కుడికి ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు.


స్వరపురం గ్రామాధికారి దుర్మార్గుడు. ఊళ్లో ఆయన ఆగడాలకు అంతే లేదు. పౌరుల్లో ఆయనపట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. కానీ వాళ్లు మెతకవాళ్లు. ఎదిరించలేరు సరికదా, ఎప్పుడైనా ఊరి బాగోగులు వాకబు చేయడానికి రాజప్రతినిధి వస్తే- గ్రామాధికారికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో నోరు మెదిపేవారే లేకుండాపోయారు.ఆ ఊళ్లో శకారుడనే రైతుకి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్లిద్దరూ తండ్రికి పొలం పనుల్లో సహాయపడుతున్నారు. మూడోవాడు మురళికి మాత్రం చిన్నప్పట్నించీ సంగీతమంటే ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్లనుంచేకాక, బయటవాళ్లనుంచి కూడా కొత్త కొత్త తపాటలు నేర్చుకుని సాధనచేస్తూ ఉండేవాడు. అయితే సంగీతాభిమానులు తక్కువ. ఆ ఊళ్లో- ఉంటే సంగీతం కూడు పెట్టదని ఇంట్లోవాళ్లు మురళిని నిరుత్సాహపరిచేవారు.ఇలా ఉండగా ఆ దేశపు రాజాస్థానగాయకుడు సుస్వరుడికి పెద్ద జబ్బు చేసి తగ్గింది. 


తొందరగా కోలుకోడానికి గాలిమార్పు అవసరమని వైద్యులు చెబితే- ఆయన స్వరపురం వచ్చాడు. సంగీతం ముచ్చట్లతో కాలక్షేపంచేసే ఆయనకు తోడుగా ఉంచడానికి గ్రామాధికారికి మురళితప్ప వేరెవ్వరూ దొరకలేదు. మురళి అదే తన అదృష్టంగా భావించి ఆయనకు శుశ్రూషలు చేశాడు. ఆయన మురళి పాట విని, ‘‘సానబెడితే కానీ వజ్రానికి మెరుపు రాదు. సాధన చేస్తే కానీ గొంతుకు శ్రావ్యత రాదు. ఒక సంవత్సరంపాటు గొంతెత్తి పాడుతూ సాధన చేయి’’ అని సలహా ఇచ్చి సంగీతంలో కొన్ని మెలకువలు నేర్పాడు.సుస్వరుడు అలా ఆ ఊళ్లో నెల్లాళ్లు ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. రాజధానికి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన గ్రామాధికారితో, ‘‘మురళి సంగీతసాధనకు ఊరంతా సహకరించేలా చూడు. వాడి సంగీతం ఊరికి మేలు చేస్తుంది’’ అన్నాడు.


ఊరికి మేలు అనగానే గ్రామాధికారి గుండెల్లో రాయి పడింది. ఆయన వెంటనే గ్రామంలో జ్యోతిష్కుణ్ణి పిలిచి సుస్వరుడన్నమాట చెప్పాడు. జ్యోతిష్కుడు మురళి జాతకం పరిశీలించాడు. రాజాస్థానగాయకుడి మాట సమర్థించాలనుకున్నాడో, లేక నిజంగానే వాడి జాతకంలో అలాగున్నదో కానీ, ‘‘మురళి సంగీతం మన ఊరి ప్రజల జీవితాల్ని బాగుచేయడం తథ్యం’’ అన్నాడాయన. ‘‘ఈ ఊరిని నేనే బాగుచేస్తాను. మురళికి ఆ అవకాశం ఇవ్వను’’ అన్నాడు గ్రామాధికారి వెంటనే. ఆ ప్రకారం ఆయన-, ఊళ్లో ఎవ్వరూ మురళి సంగీతసాధనకు సహకరించరాదని శాసనం చేశాడు. అది అన్యాయమని ఏ ఒక్కరూ పైకి అనలేకపోయారు.


సుస్వరుడి మాటమీద మురళి సంగీతసాధన మొదలెడితే- ఇంట్లోవాళ్లు ఊళ్లోకెళ్లి పాడుకోమన్నారు. ఊళ్లోవాళ్లు ఇంటికెళ్లి పాడుకోమన్నారు. మిత్రులైతే, ‘‘నీది గార్దభస్వరం’’ అంటూ ఎద్దేవా చేశారు. తన పాటలతో ఊరు బాగుపడుతుందని వాడంటే, ‘‘నువ్వు పాడకపోతేనే ఊరు బాగుంటుంది’’ అని అంతా తిరస్కరించారు. చివరకు మురళి గ్రామాధికారిని కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన వాడిమీద లేని ప్రేమ నటిస్తూ, ‘‘నేను గ్రామాధికారిని. ఊరి ఇష్టమే నా ఇష్టం. నీకంతగా సంగీతసాధన చేయాలనుంటే ఇక్కడకు దగ్గిర్లోని స్వరారణ్యానికి వెళ్లు. అక్కడ నిన్ను అభ్యంతరపెట్టేవారుండరు’’ అన్నాడు.మురళి స్వరారణ్యానికి ప్రయాణమైతే అదేమని వారించిన వారొక్కరూలేరు.మురళి అడవిమధ్యకు చేరుకున్నాడు. గొంతెత్తి పాట పాడటం ప్రారంభించాడు. 


అతడిపాటకు ఒక్కసారిగా లేళ్లు, తోడేళ్లు, నక్కలు, పులులు, సింహాలు, ఏనుగులు వగైరా జంతువులన్నీ వాడి చుట్టూ చేరి అటూఇటూ పరుగులు తీశాయి. వాటిని చూస్తూనే గుండెలవిసిపోయిన మురళి పాట ఆపేశాడు. మరుక్షణం జంతువులన్నీ అక్కణ్ణించి పారిపోయాయి.అప్పడక్కడికి దివ్యచక్షుడనే తపస్వి వచ్చాడు. ఆయన మురళి కథ తెలుసుకుని, ‘‘నువ్వు సరైనచోటుకే వచ్చావు. ఇది సంగీత స్వరారణ్యం. ఇక్కడి జంతువులు మనుషుల్ని హింసించవు. నువ్వు గొంతెత్తి పాడితే- అవి నీ చుట్టూచేరి- గెంతుతూ, పరుగెత్తుతూ వినోదిస్తాయి. ఏ రోజున అవి చిందులుమాని మౌనంగా నీ పాట వింటాయో ఆ రోజుతో నీ సాధన పూర్తయినట్లు. అంతవరకూ నువ్విక్కడ నిరాటంకంగా సంగీతసాధన చేయవచ్చు’’ అన్నాడు.


మురళి ఆయనకు నమస్కరించి, ‘‘మహాతపస్వులైన మీ దర్శనం నా అదృష్టం. కానీ నేను ఈ అడవి జంతువులమధ్య సాధన చేయలేను. మా ఊరివాళ్లు నా సాధనకు సహకరించేలా వరమివ్వండి’’ అని వేడుకున్నాడు.దివ్యచక్షుడు కాసేపు ఆలోచించి, ‘‘కృత్రిమమైన మానవస్థావరాలకంటే, ప్రకృతి సహజమైన అరణ్యాలే సంగీతసాధనకు మేలైనవి. అయినా నువ్వు మీ ఊరికే కట్టుబడి ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీకో మంత్రం ఉపదేశిస్తాను. అది ముమ్మారు జపిస్తే- నీ పాట విననివారు వారివారి ప్రవృత్తికి అనుగుణంగా జంతు రూపం ధరిస్తారు. అది క్రూరజంతువు రూపమైనా దానివల్ల మనుషులకు హాని ఉండదు. ఈ నీ శక్తిపట్ల నమ్మకం కుదిరిందంటే- గ్రామస్థులు నీ సంగీతసాధనకు తప్పక సహకరిస్తారు’’ అంటూ మురళికి ఆ తపస్వి మంత్రోపదేశం చేశాడు.


మురళి గ్రామానికి తిరిగివెళ్లి, జరిగిందంతా మిత్రులకు చెప్పాడు. వాళ్లకు వాడి మాటలమీద నమ్మకం కుదరకపోయినా, లేని భయం నటిస్తూ, ‘‘ఏం చేస్తాం, పాడుకో- వింటాం’’ అన్నారు. మురళి సంతోషించి గొంతెత్తి పాట మొదలెట్టాడు. వెంటనే మిత్రులు, ‘‘అమ్మో! నీ పాట వినడంకంటే జంతువు కావడమే మెరుగు. వెంటనే పాట ఆపు. లేదా మేమే ఇక్కణ్ణుంచి పారిపోతాం’’ అన్నారు. వాళ్లు తనని ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన మురళి వెంటనే పాట ఆపి దివ్యచక్షుడు తనకు ఉపదేశించిన మంత్రం ముమ్మారు జపించాడు. అంతే- వాడి మిత్రులందరూ నక్కలుగా మారిపొయ్యారు. ‘‘ఇంతకాలం మిత్రులనుకున్నాను. మీవి నక్కజిత్తులన్నమాట!’’ అనుకున్నాడు మురళి బాధగా. ఆ నక్కలు కాసేపు మురళిచుట్టూ తిరిగాయి. మురళి మళ్లీ పాటపాడటానికి గొంతెత్తగానే ఊళ పెడుతూ పారిపోయాయి.


మురళిని కలుసుకున్నాక తమ పిల్లలు నక్కలుగా మారిపోయి మాయమయ్యారని ఆ పిల్లల తలిదండ్రులకు తెలిసింది. వాళ్లు మురళివద్దకువెళ్లి సంజాయిషీ అడిగితే, ‘‘ముందు నాపాట వినండి. లేదా మీరూ జంతువులైపోతారు’’ అన్నాడు మురళి నిర్లక్ష్యంగా. వాళ్లుకూడా వాడిమాట నమ్మలేదు. పాట వినమని మొరాయించి ఆలమందలుగా మారిపోయారు. వాడు మళ్లీ గొంతెత్తగానే అంబా అంటూ పారిపోయారు.అలా కొనసాగితే గ్రామమంతా పశుమయమైపోతుందని భయపడ్డాడు మురళి. ఊరివాళ్లు తన మంత్రంకంటే ఎక్కువగా గ్రామాధికారికి భయపడతారనుకుని మురళి ఆయన ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు. గ్రామాధికారి మండిపడి, ‘‘మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ నీవంటి వదరుబోతు ఈ ఊరికే ప్రమాదం’’ అంటూ అతడిని కారాగారంలో వేయమని భటులకు పురమాయించాడు.


భటులు తనని సమీపించేలోగా- మురళి మంత్రం జపించాడు. గ్రామాధికారి వెంటనే పెద్దపులిగా మారిపోయాడు.‘‘నీ అసలు స్వరూపం ఇదన్నమాట! సరేలే- నీలాంటివాడు పులిగాకంటే- మనిషిగా ఉంటేనే ప్రమాదకారి’’ అనుకున్నాడు మురళి. అక్కడున్న భటులకు ఏం చేయాలో తెలియక దిగ్భ్రాంతులై చూస్తుంటే- అంతలో అలా వచ్చింది గ్రామాధికారి భార్య. జరిగింది తెలుసుకుని, తననీ పులిగా మారిస్తే భర్తతో కలిసి అడవికెళ్లి జీవిస్తానని ఏడుస్తూ వేడుకుంది. అప్పుడు మురళి మంత్రం జపిస్తే- ఆమె పులిగాకాక కుక్కలా మారిపోయింది. ‘‘భర్తపట్ల ఉన్న విశ్వాసం నిన్ను కుక్కను చేసిందన్న మాట!’’ అనుకున్నాడు మురళి.


ఈలోగా భటులద్వారా జరిగింది తెలిసి ఊరు ఊరంతా ఆ వింతచూడ్డానికి గ్రామాధికారి ఇంటికి తరలి వచ్చింది. మురళి వారినుద్దేశించి, ‘‘మీరంతా నా పాట వినండి. మనూరికి మేలు జరుగుతుంది. మీకు మానవరూపమూ మిగులుతుంది’’ అన్నాడు.గ్రామస్థులు తమలోతాము మంతనాలు జరిపారు. దుర్మార్గుడైన గ్రామాధికారికంటే మంత్రగాడైన మురళివల్లనే ఎక్కువ ప్రమాదమని వాళ్లందరికీ అనిపించింది. తామంతా ఒక్కటైతే, మురళి తమను ఏమీచేయలేడనుకున్నారు. అదీకాక తమలో మురళికుటుంబం కూడా ఉన్నది. ఆ ధైర్యంతో వాళ్లు అతడి బెదిరింపును లెక్కచేయలేదు. అప్పుడు మురళి మళ్ళీ మంత్రం జపించాడు. వెంటనే అక్కడున్నవారందరూ గొఱ్ఱెలుగా మారిపోయారు. వాడు గొంతు ఎత్తగానే అరుచుకుంటూ పారిపోయారు.


ఊళ్లో ఇక తనని అడ్డుకునేవాళ్లెవ్వరూ లేరని నమ్మకం కుదిరేక మురళి గొంతెత్తి పాడసాగాడు. అలా ఓ చరణం పూర్తిచేశాడో లేదో, అంతలో మురళికి మంత్రోపదేశం చేసిన దివ్యచక్షుడు అక్కడకువచ్చి, ‘‘ఆపు నాయనా!’’ అన్నాడు.‘‘స్వామీ! ఈ సాధన నాకెంతో సంతోషాన్నిస్తోంది. నన్నాపకండి. మిమ్మల్ని కూడా జంతువుగా మార్చేయగలను’’ అని హెచ్చరించాడు మురళి. దివ్యచక్షుడు అతడి మాటలకు చలించలేదు. ‘‘అది సరే కానీ- నువ్వు జంతువులమధ్య సంగీతసాధన చేయలేనని కదా అడవికి వెళ్లనన్నావు. ఇప్పుడీ ఊరంతా జంతువులమయమైపోయిందే! ఇదే ఓ అడవిలా మారిపోయిందే. ఇక ఈ జంతువుల మధ్య సంగీతసాధన ఎలా చేస్తావు?’’ అన్నాడు.ఆ ప్రశ్నకు మురళి గతుక్కుమన్నాడు. కానీ తమాయించుకుని, ‘‘ఇప్పుడు నాకు ఆకారంలోనే తప్ప ప్రవృత్తిలో మనిషికీ, జంతువుకీ తేడా లేదని తెలిసింది. ఇప్పుడు నాకు ఊరైనా, ఆడివైనా ఒకటే!’’ అన్నాడు.


‘‘విషయం చక్కగా గ్రహించావు. ఇక నీకు ఊరైనా అడవి అయినా ఒకటే కాబట్టి- నీ సంగీత సాధన అడవిలో చేసుకో. నేను గ్రామస్థులందరికీ యథారూపాలిస్తాను’’ అన్నాడు దివ్యచక్షుడు.మురళి ఆయనకు చేతులుజోడించి, ‘‘సర్వజ్ఞులు. మీ మాట నాకు శిరోధార్యం. అర్భకుడినైన నా అపరాధాన్ని మన్నించండి’’ అంటూ దివ్యచక్షుడి పాదాలమీద పద్దాడు.బేతాళుడు ఇంతవరకూ కథ చెప్పి, ‘‘రాజా! పర్యవసానాల గురించిన ఆలోచన, ఇంగితజ్ఞానంలేని మురళికి మహిమగల మంత్రం ఉపదేశించిన దివ్యచక్షుడు తపస్వి ఎలా ఆవుతాడు? అపాత్రదానం అవివేకుల లక్షణం కాదా? మురళిని మళ్లీ అడవికి వెళ్లమనడం ఆయనలోని తొందరపాటుకూ, ద్వేషబుద్ధికీ నిదర్శనం కాదా? ఇంత తతంగం జరిపించి ఆయన సాధించిందేమిటి? ఆయన అకారణ ఆగ్రహంనుంచి తప్పించుకోవడానికే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించి ఆయన ఆజ్ఞ శిరసావహించాడా? ఈ సందేహాలకు తెలిసికూడా సమాధానం చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలవుతుంది’’ అన్నాడు.


దానికి విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు.‘‘స్వరపురం గ్రామస్థుల స్వభావం గురించి మురళినుంచి విన్న దివ్యచక్షుడు, మురళి ద్వారానే వారిలో మార్పు తీసుకురావాలని ఆశించాడు. అయితే, అన్నాళ్లు గ్రామాధికారి దుర్మార్గాన్ని సహనంతో భరించిన గ్రామస్థులు మురళిపాటను భరించలేకపోయారు. పైగా మంత్రమహిమకుసైతం భయపడకుండా కలిసికట్టుగా ఎదురుతిరిగారు. అంటే, ఏ విషయంలో ఎదురుతిరగాలో, ఏ విషయంలో సహనం వహించాలో కూడా వారికి తెలియదు. అలాంటి పౌరులవల్ల ఏ ఊరైనా అధోగతిపాలు కాకతప్పదు. దేవుడు మనిషికి బుద్ధినిచ్చాడు. దానిని ఉపయోగించనివారు జంతువులతో సమానం. సేవ చెయ్యాలన్న బుద్ధిని ఉపయోగించని గ్రామాధికారి తన పదవివల్ల పెద్దపులయ్యాడు. 


అన్యాయాన్ని ఎదిరించాలన్న బుద్ధిని ఉపయోగించలేక గ్రామస్థులు గొఱ్ఱెలయ్యారు. మేలు చెయ్యాలన్న లక్ష్యంతో సంగీతసాధన మొదలుపెట్టిన మురళి, బుద్ధిని సరిగ్గా ఉపయోగించక ఊరినే అడవిగా మార్చేశాడు. అయితే, ఈ సంఘటనద్వారా గ్రామస్థులు తమలోని జంతుప్రవృత్తిని ఎవరికివారు ప్రత్యేకంగా తెలుసుకున్నారు కనుక, వారిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశతోనే దివ్యచక్షుడు వారికి మళ్లీ మానవరూపాలు వచ్చేలా చేసి, మురళిని అడవికి వెళ్లి సంగీతసాధన చేయమన్నాడు. స్వరూపంలోనే కాకుండా స్వభావంలోనూ ఊరును ఊరుగా తీర్చిదిద్దడానికి సంకల్పించాడే తప్ప, దివ్యచక్షుడిలో ఎలాంటి అనాలోచితమైన తొందరపాటుగానీ, ద్వేషబుద్ధిగానీ లేవు. ఈ నిజాన్ని గ్రహించడంవల్లనే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని గుర్తించాడు” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

** సమాప్తం **


Comments

Popular posts from this blog

నమ్మకమే.. స్నేహం! | Moral Stories | Telugu Stories @multiplewaystogrow

The Adventures of Sunny and Sparkle | Friendship Stories | Moral Stories @multiplewaystogrow

Amazon is hiring for Associate – Retail Process | Apply Now